: ఆరోగ్యంగా ఉండాలంటే 4 నిముషాలు చాలు...
ఫిట్‌గా ఉండాలంటే రోజూ గంటలకొద్దీ వ్యాయామం చేయాల్సిన పనిలేదని, కేవలం నాలుగు నిముషాలు చేస్తే చాలని అంటున్నారు పరిశోధకులు. తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో వారంలో మూడు రోజులకు ఒకసారి కేవలం నాలుగు నిముషాల పాటు వ్యాయామం చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని తేలింది. నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సుమారు 26 మందిని ఈ విషయంలో అధ్యయనం చేశారు.
బద్ధకంతోబాటు బరువు కూడా ఎక్కువగా ఉన్న 26 మందిని తీసుకుని వారిలో కొద్ది మందితో పది వారాల పాటు వ్యాయామం చేయించారు. మరి కొద్ది మందితో వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే నాలుగేసి నిముషాల పాటు వ్యాయామం చేయించారు. ఫలితంగా వీరిలో ఆక్సిజన్ స్థాయి పెరగడంతోబాటు ఇతర మంచి ఫలితాలు కూడా కనిపించాయి. అంటే మూడు రోజులకు ఒకసారి నాలుగు నిముషాల పాటు చక్కటి వ్యాయామం చేస్తే తద్వారా మనం పీల్చుకునే ఆక్సిజన్ పెరుగుతుందని, రక్తపోటు, చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయని, ఒకేసారి 16 నిముషాల పాటు వ్యాయామం చేసిన వారికంటే వీరిలో మెరుగైన ఫలితాలు కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు.