: ఈ రోబో మనలాగే నడుస్తుంది!
రోబోలు నడిచే విధానం వేరుగా ఉంటుంది. అయితే వీటి నడకను మనలాగే ఉండేలా చూడాలని శాస్త్రవేత్తలు ఆలోచించారు. దీనికి ఫలితమే ఈ కొత్త రోబో. ఈ రోబో మనలాగే నడుస్తుందట. మానవుని నడక తీరును పరిశీలించిన శాస్త్రవేత్తలు రోబో నడక మనుషుల నడకను పోలి ఉండే విధంగా దాని కాలి భాగాలను తయారుచేసి దానికి అమర్చారు. దీంతో ఆ రోబో చక్కగా మనుషుల్లాగే నడుస్తుందట.
రోబో నడకను మరబొమ్మ లాగా కాకుండా మరింత సహజంగా ఉండేలా రూపొందించాలనుకున్నారు జపాన్‌లోని వాసెడా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. దీంతో వాబియాన్-2ఆర్ అనే రోబోను తయారు చేశారు. దీనికి తేలిగ్గా కదిలే కటిభాగం, మోకాళ్ళు, పాదంలో ఒంపు, సులువుగా కదిలే కాలివేళ్ళు వంటి భాగాలను అమర్చారు. 5 అడుగుల పొడవు, 64 కిలోల బరువు కలిగిన ఈ రోబో నడకను మరింత మెరుగు పరచాలనుకున్న శాస్త్రవేత్తలు 'మోషన్ క్యాప్చర్ డేటా'ను విశ్లేషించారు. దీని ఆధారంగా రోబో కాళ్ళ భాగాన్ని మళ్లీ డిజైన్ చేశారు. చక్కగా మానవుడిలాగే నడిచేలా కొత్త రోబోను తయారుచేశారు. దీనికి వాబియాన్-2ఆర్3 అనే పేరు పెట్టారు. ఈ కొత్త రోబో 0.6 సెకన్లలో అడుగు వేస్తుంది, 12 డిగ్రీల మేరా పాదం కదుపుతుంది, 90 మిల్లీ మీటర్ల అడుగు వెడల్పుతో ఇది ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మనిషిలాంటి నడకతీరుతో నడుస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.