Telangana: వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో సీనియర్ స్టూడెంట్ సైఫ్ అరెస్ట్
- సైఫ్ వేధింపులతో ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని ఆరోపణలు
- ఈ ఉదయం అరెస్ట్ చేశామన్న ఏసీపీ
- కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల అనస్థీషియా విభాగం విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ పీజీ విద్యార్థి డా.సైఫ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. డా.ప్రీతిని వేధించాడన్న ఆరోపణలు సైఫ్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా.. ముట్టెవాడ పోలీసులు సైఫ్‌ను ఈ తెల్లవారు జామున అరెస్ట్ చేసినట్టు ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే.. ప్రీతిని సైఫ్ వేధించినట్టు అతడి మొబైల్‌లో కొన్ని ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహిస్తామని ఏసీపీ తెలిపారు.
ప్రీతి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ముట్టెవాడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఏసీపీ, ఇతర పోలీసు అధికారులతో కేసును సమీక్షించారు. ఇదిలా ఉంటే.. విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టనున్నారన్న సమాచారంతో కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.