: గర్భం నుండే కిడ్నీ సమస్యలు ప్రారంభం!
మూత్రపిండాల సమస్యలు పెద్దయ్యాక వస్తాయనుకోవడం పొరబాటు. తల్లిగర్భంలో ఉన్నప్పటి నుండే బిడ్డలో మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య పరమైన వాతావరణం ఉండాల్సి ఉందని, లేకుంటే గర్భస్థ దశలో ప్రారంభమైన సమస్యలు పెద్దయ్యాక వాని ప్రభావం చూపించి, సదరు బిడ్డకు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు సృష్టిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన ఒక తాజా అధ్యయనంలో ఈ విషయం గుర్తించారు.
తల్లి గర్భంలో బిడ్డకు ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టయితే అది గర్భంలో ఉన్న శిశువు మూత్రపిండాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా పెద్దయ్యాక దశాబ్దాల తర్వాత కూడా తీవ్ర సమస్యలకు కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్కువ బరువుతో జన్మించి, నెలలు నిండకముందే జన్మించిన శిశువులు పెద్దయ్యాక వారిలో మూత్రపిండాల్లో రక్తాన్ని శుభ్రం చేసే నెఫ్రాన్ల సంఖ్య తక్కువగా ఉన్నట్టు వారు గుర్తించారు. ఈ విషయం గురించి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జాన్ బెర్‌ట్రామ్ మాట్లాడుతూ గర్భస్ధ శిశువులోని మూత్రపిండంలో 36 వారాల వరకే నెఫ్రాన్లు తయారవుతాయని, ఆ తర్వాత అవి తయారు కావడం ఆగిపోతుందని, ఇది తర్వాత కాలంలో చాలా ప్రభావం చూపుతుందని అన్నారు. ఇదే తర్వాత కాలంలో అధిక రక్తపోటుకు, కిడ్నీ జబ్బులకు కారణంగా పరిణమిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.