: అరుణగ్రహంపై నీటి ఆనవాలు!
అంగారకుడిపై ఒకప్పుడు నీరు ఉండేదనడానికి గట్టి ఆధారాలను సేకరించింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆ గ్రహంపైకి పంపిన క్యూరియాసిటీ రోవర్. అరుణగ్రహంపైన ఉండే అనేక శిలలను పరిశోధించిన రోవర్ ఈ విషయాన్ని నిర్ధారించింది. గతంలో ఉపగ్రహాలు అందించిన అనేక చిత్రాల్లో ఈ గ్రహంపై నీరు పారిన కాలువలకు సంబంధించిన అనేక ఆనవాళ్లు కనిపించాయి. అయితే, దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం స్వల్పంగా లభ్యమయ్యాయి. నాసా గతంలో ప్రయోగించిన రోవర్లు కూడా నీటి ఉనికికి సంబంధించి తక్కువ స్థాయిలోనే ఆధారాలను అందించాయి. అయితే తాజాగా లిండాకాప్‌ా నేతృత్వంలో రోవర్ పరిశోధక బృందం అంగారక శిలలకు సంబంధించిన ఫోటోలను విశ్లేషించింది. ఆ గ్రహంపై ఒకప్పుడు ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం ఆ గ్రహంపై ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఉండేవని తేల్చారు. అంతేకాదు, గతంలో ఆ గ్రహంపై ఉన్న పరిస్థితులు జీవుల మనుగడకు అనువుగా ఉండేవని తేల్చారు.
అరుణగ్రహంపై జీవుల ఆవాసానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? అనే విషయంపై పరిశోధించిన రోవర్ మాస్ట్‌కామ్ ద్వారా హై రిజల్యూషన్ చిత్రాలను తీసి పంపింది. రోవర్ ల్యాండ్ అయిన ప్రాంతంనుండి ప్రస్తుతం అది పయనిస్తున్న 'ఎల్లోనైఫ్‌బే'కు చేరిన మార్గంలోని గుండ్రటి గులకరాళ్లతో తయారైన భారీ శిలాకృతులను తన కెమెరాతో చిత్రించి పంపింది. ఈ చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఒకప్పుడు అరుణగ్రహం వేడిగా, వేల కిలోమీటర్ల పాటు నీటి ప్రవాహానికి అనువుగా ఉండేదని స్పష్టమవుతున్నట్టు తెలిపారు. ఈ గులకరాళ్లు నీటి ప్రవాహం కారణంగా కోతకు గురై, గుండ్రని ఆకృతికి మారినట్లు లిండా తెలిపారు. వేగంగా ప్రవహించే నీటి కారణంగా ఈ గులకరాళ్లు కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ కదిలినట్లు స్పష్టమవుతోందని ఆయన వివరించారు.