: మహిళల స్మోకింగ్ కు హీరోలే స్ఫూర్తి
పొగతాగే మహిళల్లో మూడొంతుల మంది సినిమాలలో కథానాయకుల నుంచి స్ఫూర్తి పొందినవారేనట. అంతేకాదు, పొగతాగే నారీమణులలో 52 శాతం మంది పొగమానేయడానికి ఇష్టపడడం లేదు. కానీ, పురుషులలో మాత్రం ఇలాంటి మొండి పొగరాయుళ్లు 35 శాతం మందే ఉన్నారు. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. ముంబై, ఢిల్లీ, కోల్ కత, బెంగళూరు నగరాలలో 18 నుంచి 35 సంత్సరాల మధ్య వయసున్న 914 మంది అభిప్రాయాలను సర్వే కోసం తీసుకున్నారు. 77 శాతం మంది పొగతాగడం వల్ల ఆరోగ్యానికి వచ్చే ప్రమాదమేమీ లేదని గుడ్డిగా చెప్పడం నిపుణులను నిర్ఘాంతపోయేలా చేసింది. అన్నేసి ప్రకటనలు ఇస్తూ అంతగా ప్రచారం నిర్వహిస్తున్నా పొగతాగడం వల్ల నష్టమేమీ లేదని అధిక శాతం మంది భావిస్తుండడం ప్రమాదకరమైన ధోరణిగా నిపుణులు చెబుతున్నారు.