Rohit Sharma: ఆటను చూడడానికి వచ్చిన అభిమానులకు రోహిత్ శర్మ ప్రత్యేక ధన్యవాదాలు
- బాగా వేడి వాతావరణాన్ని గుర్తు చేసిన రోహిత్
- అలాంటి పరిస్థితుల్లో కూర్చుని ఆటను వీక్షించడం సులభం కాదని వ్యాఖ్య
- జట్టు సభ్యుల ఆటతీరుపై ప్రశంసలు
వెస్టిండీస్ తో సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ మైదనాంలో జరిగిన నాలుగో టీ20లో భారత్ అద్భుత విజయం సాధించడం వెనుక ఆటగాళ్ల కృషిని కెప్టెన్ రోహిత్ శర్మ మెచ్చుకున్నాడు. వెస్టిండీస్ టాస్ గెలిచి భారత జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించగా.. దీన్ని భారత్ సద్వినియోగం చేసుకుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేకపోయినా.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, సంజు శామ్సన్ రాణించడంతో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా వెస్టిండీస్ 132 పరుగులతో ఆల్ అవుట్ అయింది.
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘191 పరుగులు మంచి స్కోరు. కానీ, వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ ముందు ఏదీ మంచి స్కోరు కాదు. కాకపోతే చక్కగా ఆడి విజయం సాధించాం. బ్యాటర్లు నిజంగా స్మార్ట్ గా వ్యవహరించారు. బౌలర్లు సైతం సమన్వయంగా వికెట్లు రాబట్టారు’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లను తీసిన అవేశ్ ఖాన్ ను మెచ్చుకున్నాడు. గత రెండు మ్యాచుల్లో అతడు సత్తా చూపలేక విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. అవేశ్ ప్రతిభ ఏంటో తమకు తెలుసునని రోహిత్ చెప్పాడు. ఎవరైనా ఒకటి రెండు మ్యాచుల్లో రాణించలేకపోవచ్చంటూ.. యువకులు తమ ప్రతిభ చూపేందుకు తగినంత సమయం ఇస్తామన్నాడు.
ఈ సందర్భంగా అభిమానులకు రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. ‘‘ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఇక్కడి వాతావరణం ఎంత వేడిగా ఉందో తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూర్చుని మ్యాచ్ ను చూడడం అంత తేలికేమీ కాదు’’అని అన్నాడు. స్టేడియంలో కూర్చుని తమకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు.