: బంగారం ఎప్పటికీ విలువైనదే


భారతీయులకు బంగారమంటే ముద్దు. ఆభరణాల రూపంలో పసిడిని పోగేసుకోవడం వారి హుందాతనానికి, హోదాకు సూచికగా భావిస్తారు. గత కొన్నేళ్లుగా పెట్టుబడులకూ ఇది ఒక చక్కని సాధనంగా మారింది. అదే సమయంలో భారతీయుల బంగారం వినియోగం కూడా అమాంతం పెరిగిపోయింది. దీనికి కారణం భారతీయుల ఆదాయం పెరగడమే. దీంతో దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగానూ బంగారం ధర పైపైకి పోయింది.

అయితే, ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారం మరింత భద్రతతో కూడిన పెట్టుబడి సాధనంగా దేశాలు భావించడం పసిడిని కొండెక్కేలా చేసింది. ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండడంతో బంగారం ధర కొద్దిగా దిగి వస్తోంది. ముఖ్యంగా డాలర్ బలహీనపడినప్పుడు బంగారంలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. మళ్లీ డాలర్ బలపడుతున్నందున పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి. ఈ కారణంగానే ఈ ఏడాది ఇప్పటి వరకూ బంగారం ధర 17 శాతానికి పైగా పడింది. 10 గ్రాములకు రూ.31,000 నుంచి రూ.26,500కు దిగివచ్చింది.

కానీ, ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి అవసరాలకు సరిపడా ఉంది తప్పించి అదనంగా ఏమీ లేదు. దీంతో స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలానికి చూసుకుంటే బంగారానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. భారతీయుల ఆదాయం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నందున బంగారం వినియోగం ఇంకా పెరుగుతుందని, పెట్టుబడులు కూడా పెరుగుతాయని అంటున్నారు. అదే సమయంలో బంగారం ఎప్పటికీ ద్రవ్యోల్బణాన్ని కాచుకుని పెట్టుబడుల విలువ కాపాడే సురక్షిత సాధనంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పసిడి కళకళలు ఎప్పటికీ తరిగిపోనివేనంటున్నారు.

  • Loading...

More Telugu News