: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో రాష్ట్రం పాత్ర!
దేశంలో సరికొత్త కుంభకోణంగా వెలుగు చూసిన అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పేరు బయటకు రావడం సరికొత్త సంచలనానికి దారి తీసింది.
ఇటలీకి చెందిన ఫిన్ మెక్కానియా 12 అగస్టా హెలికాప్టర్లను భారత రక్షణ శాఖకు సరఫరా చేయాలి. ఈ మేరకు రూ.3600కోట్ల విలువైన ఒప్పందం 2010లో కుదిరింది. ఈ ఒప్పందం దక్కించుకునేందుకు ఫిన్ మెక్కానియా 360 కోట్ల రూపాయల వరకూ భారత్ లో అధికారులు, నేతలకు లంచాలుగా చెల్లించిందని ఇటలీ పోలీసులే వెలుగులోకి తెచ్చారు. ప్రాథమిక విచారణ అనంతరం కంపెనీ అధిపతులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ ప్రారంభించారు. వారు చార్జ్ షీట్ లో పేర్కొన్న వివరాల వల్లే ఇప్పడు ఈ కుంభకోణంలో రాష్ట్రం పేరు బయటకు వచ్చింది.
వాయుసేన మాజీ అధిపతి ఎస్.పీ.త్యాగి సోదరులు ముగ్గురికి ఫిన్ మెక్కానియా కంపెనీ ప్రతినిధులు ముడుపులు చెల్లించారని ఇటలీ పోలీసులు పేర్కొన్నారు. ఇందుకోసం హష్కే అనే మధ్యవర్తిని ఫిన్ మెక్కానియా సీఈవో ఓర్సి సంప్రదించాడు. అతడు త్యాగి సోదరుడిని కలిశాడు. ఇందుకు వీరిద్దరి మధ్య గరోసా అనే మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడు. ఆ తర్వాత అందరూ కలిసి 2005 ఫిబ్రవరిలో వాయుసేన అధిపతి ఎస్.పీ.త్యాగితో సమావేశం అయ్యారు. ఇటలీ పోలీసుల విచారణలో హష్కే ఈ వివరాలన్నీతెలిపాడు. మరి వీరిలో ప్రధాన నిందితులిద్దరూ గరోసా, హష్కేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం ఉంది.
హష్కే ఎమ్మార్, ఎంజీఎఫ్ కంపెనీలకు డైరెక్టర్ గా గతంలో వ్యవహరించారు. ఈ కంపెనీలకు గతంలో పలు కాంట్రాక్టులు దక్కాయి. ఇక, గరోసాకు ఖమ్మం జిల్లా కేంద్రం, కరుణగిరిలో ఉన్న 'ఆర్బర్' అనే క్రైస్తవ మత చారిటబుల్ సంస్థతో సంబంధం ఉంది. 'ఆర్బర్' సంస్థ లో గరోసా గతంలో అధికార బాధ్యతలు నిర్వర్తించారని సమాచారం. ఇటలీ అధికారుల విచారణలో మరికొన్ని కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెల్లడయ్యాయి.
ఫిన్ మెక్కానియా భారత్ లో అధికారులు, నేతలకు రూ.360కోట్ల వరకూ చెల్లించారు. మరి ఆ నిధులన్నీ ఏ రూపంలో దేశంలో్కి వచ్చాయనుకుంటున్నారు? సాధారణంగా ఇంత మొత్తంలో విదేశీ సొమ్ముదేశంలోకి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. అక్కడే గరోసా మిగతా ముఠా తెలివిగా వ్యవహరించింది. అర్బర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ అవినీతి సొమ్ము భారత్ కు తీసుకొచ్చి అవినీతి పరుల జేబులు నింపారని తెలుస్తోంది. స్వచ్ఛంద సంస్థలకు వచ్చే నిధులపై ఆంక్షలు తక్కువ. అందుకే వీరు ఈ మార్గాన్ని వినియోగించుకున్నారని సమాచారం. ఈ మత సంస్థలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇవన్నీ ఇటలీ అధికారుల చార్జ్ షీట్ ను ఉటంకిస్తూ వెలుగు చూసిన భయంకర నిజాలు. సీబీఐ ఈ రోజు హెలికాప్టర్ల స్కాముపై విచారణ ప్రారంభించింది. సీబీఐ అధికారులు రక్షణ శాఖాధికారులతో సమావేశమై ఒప్పందానికి సంబంధించిన వివరాలు సేకరించారు. వీరి విచారణలో రాష్ట్రానికి చెందిన ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వస్తుందేమో చూడాలి.