Ambati Rambabu: ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలి: అంబటి రాంబాబు
- అంబటి రాంబాబు ప్రెస్ మీట్
- ఎల్లో మీడియా ఉచ్చులో పడొద్దని ఉద్యోగులకు హితవు
- చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని వెల్లడి
- చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని వ్యాఖ్యలు
ఓవైపు విజయవాడలో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం కొనసాగుతున్న తరుణంలో, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. తమది ఉద్యోగులపై కక్ష సాధించే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా తమకు లేదని అన్నారు.
చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, ఉద్యోగులు చర్చలకు ముందుకు రావాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఎల్లో మీడియా ఉచ్చులో ఉద్యోగులు పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడుతుండడంతో చంద్రబాబు భరించలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని మోసం చేయాల్సిన అవసరం సీఎం జగన్ కు లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏంచేసినా టీడీపీ అడ్డుతగులుతోందని, 3 రాజధానులు అంటే కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు గుడివాడలో గోవా కల్చర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజనిర్ధారణ పేరుతో గుడివాడపై టీడీపీ దాడికి వెళ్లిందని అన్నారు. సంస్కృతి, సంప్రదాయం అంటూ మంత్రి కొడాలి నానిపై నిందలు మోపే ముందు, రామోజీ ఫిలింసిటీలో 365 రోజులు జరిగే డ్యాన్సులపై టీడీపీ నేతలు ప్రశ్నించాలని హితవు పలికారు.