NDA: వచ్చే ఏడాది నుంచి మహిళా అధికారుల ఎంపికకు ఎన్డీయే పరీక్ష: సుప్రీంకు తెలిపిన కేంద్రం
- 2022 మే నెల నుంచి పరీక్షల నిర్వహణ
- సుప్రీంకోర్టు ముందు అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం
- మహిళా అధికారుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై వివరణ
సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఎన్డీయే (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో మహిళా అధికారుల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2022 మే నెల నుంచి మహిళా అధికారులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. మహిళలకు ఇవ్వాల్సిన శిక్షణ, వైద్య సదుపాయాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
మహిళలు ఉండటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. ‘‘ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండి, ఎంపిక అర్హతలు కలిగిన వారికే అనుమతి ఉంటుంది. ఇప్పటికే పురుషులకు ఉండాల్సిన అర్హతలు అమల్లో ఉన్నాయి. మహిళల విషయంలో ఉండాల్సిన అర్హతలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది’’ అని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.
మహిళలకు శారీరకంగా ఎటువంటి ఫిట్నెస్ అర్హతలు ఉండాలన్నది ఇంకా నిర్ధారించలేదని, వీటిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని తెలిపింది. ఈ విషయంలో పూర్తి విశ్లేషణ కావాలని, దీనికోసం నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటున్నామని వివరించింది. మహిళలకు కావలసిన మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా జరుగుతోందని వెల్లడించింది.
కాగా, ఎన్డీయేలోకి మహిళా అధికారులను అనుమతించకపోవడం వివక్షేనని, ఇది మైండ్ సెట్ సమస్య అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. దేశ సాయుధ దళాల్లో మహిళలకు సమానమైన సేవా అవకాశాలు అందించాలని సూచించిన సంగతి తెలిసిందే.