: ఈ బాక్టీరియా భలే గట్టిది!
బాక్టీరియా ఒక రకమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తుంటాయి. అయితే అత్యంత చల్లటి ప్రదేశంలో అంటే ఎముకలు గడ్డ కట్టించేటటువంటి మైనస్ 25 డిగ్రీల చల్లటి ప్రదేశాల్లో సైతం జీవించే ఒక కొత్తరకం బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై పరిశోధనలు చేయడం ద్వారా చల్లటి శీతల గ్రహాలైన అంగారకుడు వంటి వాటిపై జీవం ఉనికిని గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కెనడాలోని ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో నివసించే రెండువందల రకాలకు చెందిన సూక్ష్మజీవులపై మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో 'ప్లానొకొకస్ హాలోక్రయో ఫైలస్ ఓఆర్1' అనే బ్యాక్టీరియా అత్యధిక సామర్ధ్యంతో, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చురుగ్గా ఉంటోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మైనస్ 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వాతావరణం వద్ద, ఇంకా గాఢమైన ఉప్పునీటి జలాల్లోనూ చక్కగా జీవించగలుగుతోంది. దీనికి కారణం దీనియొక్క కణ ఆకృతి, పనితీరులోను మార్పులు చేసుకోగలగటం.
ఇంకా శీతల వాతావరణంలో నివసించడానికి అనువుగా ప్రోటీన్ల ఉత్పత్తిని పెంచుకోవడం వల్లే ఈ బ్యాక్టీరియాకు ఇంతటి సామర్ధ్యం వచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవించే విధంగా ఇది కణత్వచాన్ని రూపొందించుకుంటుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన లైల్‌వైట్ అంటున్నారు. ఈ బ్యాక్టీరియాపై మరింత అధ్యయనం చేయడం ద్వారా అతి శీతల గ్రహాలుగా పేరొందిన శని గ్రహం ఉపగ్రహం ఎన్‌సిలేడన్, అంగారక గ్రహం వంటి వాటిపై జీవరాశుల ఉనికి గురించి అధ్యయనం చేయడానికి మరింత సమాచారం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.