: పాకిస్తాన్ లో విషాదం
పాకిస్తాన్ లో నేడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో 16 మంది చిన్నారులు అసువులు బాశారు. తూర్పు పాకిస్తాన్ లోని గుజ్రత్ పట్టణం వద్ద ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్న స్కూలు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్.. గ్యాస్ నుంచి పెట్రోల్ కు మారే స్విచ్ వేయగా, చెలరేగిన నిప్పు రవ్వలే అగ్నిప్రమాదానికి కారణమయ్యాయి. ఈ స్కూలు బస్సు గ్యాస్, పెట్రోల్ రెండింటితో నడిచే సౌలభ్యాన్ని కలిగి ఉంది.
ఇక, తీవ్రమైన అగ్నికీలలు ఎగిసిపడడంతో తప్పించుకునే దారిలేక చిన్నారులు మాడిమసయ్యారు. వీరితో ఉన్న ఉపాధ్యాయుడూ మరణించాడు. బస్సు డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, ఈ ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలు చెలరేగగానే కిటికీలోంచి వీరిద్దరూ బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.