: బెట్టింగ్ మాయలో బడి పిల్లలు


దేశంలో గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ లపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. కొందరు అవినీతి క్రికెటర్లను ఛీకొడితే, మరికొందరు వ్యవస్థను తప్పుపడుతూ తమ తాత్కాలిక చైతన్యాన్ని చాటుతున్నారు. అయితే, అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. స్కూల్లో హాయిగా విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బాలలు సైతం బెట్టింగ్ మాయలో పడి దారితప్పుతున్నారు. 'బెట్టింగ్ కు పాల్పడితే.. బయటికి గెంటేస్తాం' అని బెంగళూరులోని ప్రైవేటు స్కూళ్ళ యాజమన్యాలు తమ నోటీసు బోర్డుల్లో ప్రకటించేంత వరకు విషయం వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితి ఎంత చేయిదాటిపోయిందో!

పాఠశాలల్లో తమ స్థాయిని బట్టి వంద రూపాయలతో మొదలై వేల రూపాయల వరకు పందాలు కాస్తున్నారట. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే.. ఇప్పటికీ చాలామందికి బెట్టింగ్ కోసం ప్రత్యేక సెల్ ఫోన్ సాఫ్ట్ వేర్ ఒకటుందని తెలియదు. కానీ, ఈ బడి పిల్లల మొబైళ్ళలో ఈ 'బెట్ రాయిడ్ వ్యూయర్' సాఫ్ట్ వేర్ ఉండడం విస్తుగొలుపుతోంది. ఈ స్పెషల్ సాఫ్ట్ వేర్ సాయంతో ఎక్కడ ఎంత మొత్తంలో బెట్టింగ్ జరుగుతుందో మనముందు ప్రత్యక్షమవుతుంది.

ఇక, ఐపీఎల్ మ్యాచ్ ఉందంటే చాలు, టీవీ ముందర హఠం వేసుకుని కూర్చుంటున్న పిల్లలు.. తమ క్లాస్ మేట్స్ తో ఫోన్ల ద్వారానే బెట్టింగ్ లు చేస్తూ, డబ్బులు తగలేసుకుంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. సచిన్ లా ఎదగకపోయినా సరేగానీ, తమ బిడ్డలు శ్రీశాంత్ లాంటి అవినీతిపరుడు కాకూడదని వారు కోరుకోవడం సబబే అనిపించడంలేదూ..!.

  • Loading...

More Telugu News