India: కరోనా వ్యాక్సిన్ల పేటెంట్ హక్కులపై భారత్ వాదనతో ఏకీభవించిన అమెరికా!
- వ్యాక్సిన్లకు సంబంధించి పేటెంట్ హక్కులు వద్దు
- అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది: అమెరికా
- అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ట్రెడ్రోస్ అథనోమ్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. అయితే, వాటికి పేటెంట్ హక్కుల నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత్ చేస్తోన్న వాదనలకు అగ్రరాజ్యం అమెరికా కూడా మద్దతు ఇచ్చింది.
తాజాగా, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటీవ్ కేథరిన్ టై ఈ విషయంపై మాట్లాడారు. వ్యాపారాలకు మేధో హక్కుల రక్షణ కీలకమే అయినప్పటికీ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి మాత్రం దాన్ని తొలగించాలన్న వాదనకు తమ దేశం మద్దతు పలుకుతోందని చెప్పారు. కరోనా వ్యాప్తి ఊహించని రీతిలో వచ్చిపడిందని, ఇటువంటి పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ల తయారీ, పంపిణీకి సంబంధించిన వ్యవస్థలను మెరుగుపర్చేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ఉత్పత్తిని పెంచుతామని చెప్పారు. కాగా, అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ట్రెడ్రోస్ అథనోమ్ చెప్పారు.
ఆ దేశం తీసుకున్న నిర్ణయం కరోనాపై పోరులో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. కాగా, వ్యాక్సిన్ల మేధో హక్కులపై మినహాయింపులు ఇవ్వాలని కొన్ని రోజులుగా డిమాండ్ పెరిగిపోతోంది.