Kuwait: కువైట్‌లో గతేడాది 1,279 మంది భారతీయుల మృతి: దౌత్యవేత్త సీబీ జార్జ్ వెల్లడి
- 334 మంది కరోనాతో కన్నుమూత
- 2019తో పోలిస్తే 572 అధిక మరణాలు
- ఈ ఏడాది ఇప్పటికే 101 మంది మృత్యువాత
కువైట్‌లో నివసిస్తున్న భారతీయుల్లో గతేడాది కాలంలో వివిధ కారణాలతో 1,279 మంది మరణించినట్టు భారత దౌత్యవేత్త సీబీ జార్జ్ తెలిపారు. వీరిలో 334 మంది కరోనా కారణంగా మృత్యువాత పడినట్టు చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువని పేర్కొన్నారు. 2019లో 707 మంది మరణించారన్నారు. ఈ ఏడాది కూడా అంత మంచి సంవత్సరంలా కనిపించలేదని, ఒక్క జనవరిలోనే 101 మంది భారతీయులు మరణించినట్టు వివరించారు.
కువైట్‌లోని భారత దౌత్యకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ గణాంకాలను వెల్లడించారు. మెడికల్ ఎస్కార్ట్ అవసరమైన ప్రతి ఒక్క భారతీయుడికి ప్రయాణ ఏర్పాట్లను ఎంబసీ చేస్తుందన్నారు. అలాగే, వందేభారత్ మిషన్‌లో భాగంగా కువైట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షలమంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు చెప్పిన జార్జ్.. వివిధ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు అండగా నిలుస్తామన్నారు.