Yediyurappa: కర్ణాటకకు రానున్న టెస్లా... ఉత్పత్తి కేంద్రం ఏర్పాట్లు!
- స్వయంగా వెల్లడించిన బీఎస్ యడ్యూరప్ప
- విద్యుత్ వాహనాల ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్న టెస్లా
- ఇండియాకు రానున్నామని గతంలోనే చెప్పిన ఎలాన్ మస్క్
ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ టెస్లా, తమ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ కోసం కర్ణాటకను ఎంచుకుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, టెస్లా సంస్థ రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంతోషదాయకమని అన్నారు. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ లో కర్ణాటక ప్రభుత్వానికి అధిక కేటాయింపులు లభించాయని అన్నారు.
"అమెరికా సంస్థ టెస్లా, తన విద్యుత్ వాహనాల ప్లాంట్ ను కర్ణాటకలో నెలకొల్పనుంది" అని యడ్యూరప్ప ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు పక్కనే ఉన్న తుముకూరు జిల్లాలో ఓ పారిశ్రామిక కారిడార్ ను రూ. 7,725 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.
కాగా, జనవరిలో బెంగళూరులో ఓ కంపెనీని ఎలాన్ మస్క్ రిజిస్టర్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఓ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ ను పెట్టనున్నామని టెస్లా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ కంపెనీ 'టెస్లా మోటార్స్ ఇండియా అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్' పేరిట జనవరి 8న రిజిస్టర్ అయింది. ఈ సంస్థకు డైరెక్టర్ లలో ఒకరిగా డేవిడ్ ఫెనిస్టియన్ పేరును కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన టెస్లాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా విధులను నిర్వహిస్తున్నారు.
ఇదిలావుండగా, గతంలో భారత వ్యాపార రంగంలో తాము ప్రవేశిస్తామని గతంలో పలుమార్లు ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్ లో తమ కంపెనీ వచ్చే సంవత్సరం ఇండియాకు వస్తుందన్న సంకేతాలను వెలువరించారు. ఆపై,"ఇండియా వాంట్స్ టెస్లా" అన్న అక్షరాలు రాసున్న టీ-షర్ట్ ను ధరించిన ఆయన చిత్రాలు సైతం వైరల్ అయ్యాయి.