Salman Khan: గిరిజనులపై వివక్ష పూరిత వ్యాఖ్యల కేసు.. సినీ నటుడు సల్మాన్ ఖాన్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- సినిమా ప్రమోషన్‌లో భాగంగా వాల్మీకి సామాజికవర్గంపై వివక్ష పూరిత వ్యాఖ్యలు
- జోధ్‌పూర్, చురు జిల్లాల్లో సల్మాన్‌పై కేసులు
- నటుడి న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణ 8 వారాలు వాయిదా
మూడేళ్ల క్రితం ఓ టీవీ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వాల్మీకి సామాజిక వర్గంపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసినట్టు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ రాజస్థాన్ హైకోర్టును సల్మాన్ ఆశ్రయించాడు. అయితే, ఇలాంటి పిటిషన్ ఒకటి సుప్రీంకోర్టులో పెండింగులో ఉందని, దానిపై నిర్ణయం వెలువడే వరకు ఈ పిటిషన్‌ను విచారించవద్దని సల్మాన్ తరపు న్యాయవాది నిశాంత్ బోరా కోర్టును కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం సల్మాన్ పిటిషన్ విచారణను 8 వారాలపాటు వాయిదా వేసింది.
2017లో తన సినిమా ‘టైగర్ జిందా హై’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ టీవీ టాక్ షోలో పాల్గొన్న సల్మాన్ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినట్టు జోధ్‌పూర్, చరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ రాజస్థాన్ హైకోర్టులో సల్మాన్ దాఖలు చేసిన పిటిషన్ నిన్న విచారణకు రాగా, సల్మాన్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను కోర్టు ఎనిమిది వారాలు వాయిదా వేసింది.