Continental Hospital: చనిపోయి రెండు రోజులైనా చెప్పలేదని గచ్చిబౌలి ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన
- అక్టోబర్ 31న హైబీపీతో ఆసుపత్రిలో చేరిన మంగూనాయక్
- ఇప్పటి వరకు రూ. 8 లక్షలు చెల్లించిన కుటుంబసభ్యులు
- మరో రూ. 6 లక్షలు చెల్లించాలన్న ఆసుపత్రి
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 42 ఏళ్ల మంగూనాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే, ఆయన చనిపోయి రెండు రోజులు గడిచినా తమకు సమాచారం అందించలేదంటూ ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
అక్టోబర్ 31న మంగూని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. హైబీపీతో బాధపడుతున్న కారణాలతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రూ. 8 లక్షల బిల్లును ఆసుపత్రి వసూలు చేసింది మరో రూ. 6 లక్షల బిల్లు చెల్లించి డెడ్ బాడీని తీసుకెళ్లాలంటూ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అప్పటి వరకు డెడ్ బాడీని తీసుకెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు.
దీంతో, తమకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. మనిషి చనిపోయి రెండు రోజులైనా తమకు చెప్పలేదని మండిపడుతున్నారు. అన్యాయంగా దోచుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అక్కడకు చేరుకున్నారు.