SP Balasubrahmanyam: మీరందరూ ఉన్నంత కాలం నాన్న మాతోనే ఉంటారు: ఎస్పీ చరణ్
- మధ్యాహ్నం 1.04 గంటలకు నాన్న కన్నుమూశారు
- ఆయన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు
- అభిమానులు ఉన్నంత వరకు ఆయన పాట నిలిచే ఉంటుంది
ఐదు దశాబ్దాలకు పైగా తన మధురగానంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గంధర్వలోకానికి వెళ్లిపోయారు. గత 40 రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలు కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో యావత్ దేశం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. తన తండ్రి 'ఇకలేరు' అంటూ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
మధ్యాహ్నం 1.04 గంటలకు ఎస్పీబీ కన్నుమూశారని చరణ్ వెల్లడించారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ తన కుటుంబం తరపున కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు. ఎస్పీబీని కాపాడేందుకు ఎంతో కృషి చేసిన ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అభిమానులందరూ ఉన్నంత కాలం నాన్న తమతోనే ఉంటారని, ఆయన పాట నిలిచే ఉంటుందని చెప్పారు.