: 'కష్టే ఫలి' అంటున్న సీఎం కిరణ్
కష్టపడితేనే ఫలితం దక్కుతుందని సెలవిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. నేడు హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలను, కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ, వారికి కర్తవ్యబోధ చేశారు. 2014 ఎన్నికలే లక్ష్యమంటూ వారిలో ఉత్సాహన్ని నింపే ప్రయత్నం చేశారు. కార్యకర్తల శ్రమవల్లే తాము పదవుల్లో ఉన్నామని చెబుతూ, కార్యకర్తను మరిచిన వాళ్ళు మరలా ఎమ్మెల్యే కాలేరని హెచ్చరించారు.
కార్యకర్తలకూ అవకాశం రావాలంటే శ్రమించడమొక్కటే మార్గమని కిరణ్ సలహా ఇచ్చారు. పోటీగా ఉన్నాడని సహచరులను తొక్కేయడానికి ప్రయత్నిస్తే అంతిమంగా అది పార్టీకే నష్టమని సూత్రీకరించారు. ఎవరి తలరాత ఎవరి చేతుల్లో లేదంటూ, కష్టపడితే అవకాశం వెతుక్కుంటూ వచ్చి తలుపుతడుతుందని చెప్పారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐకమత్యంగా పనిచేయాలంటూ వారికి సూచించారు.