: తాంత్రిక విద్యలు ప్రదర్శిస్తోన్న కొత్త పోప్
కొత్త పోప్ ఫ్రాన్సిస్ తన విలక్షణ శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొంతకాలం కిందట మహిళ పాదాలు ముద్దాడి పోప్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరదీసిన ఫ్రాన్సిస్, తాజాగా తాంత్రిక విద్యలు ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగించింది. ఆదివారం నాడు వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యవహారశైలి చర్చనీయాంశం అయింది. వ్యాధిగ్రస్తుడైన ఓ యువకుడి వద్దకు వెళ్ళి అతని తలను బలంగా పట్టుకుని అటూఇటూ ఓ డజను సార్లు ఊపి.. ఏదో పూనినవాడిలా ప్రవర్తించారు. అంతేగాకుండా తలపై చేతులుంచి బిగ్గరగా ఏవో క్షుద్ర మంత్రాలు చదువుతున్న రీతిలో ప్రార్థన చేశారు. ఈ తతంగం సాగుతున్నంతసేపూ ఆ యువకుడు బాధతో లుంగలు చుట్టుకుపోయాడు.
ఇది చూసినవాళ్ళంతా కొత్త పోప్ ఏదో దెయ్యాన్ని వదిలిస్తున్నాడని భావించారట. ఇటలీ టెలివిజన్ కేంద్రం కూడా కొందరు మంత్రగాళ్ళను ఉటంకిస్తూ, ఫ్రాన్సిస్ చేష్టలు భూత ప్రేతాలను పారద్రోలే తరహాలోనే ఉన్నాయని సూత్రీకరించింది. ఈ విషయమై వాటికన్ వర్గాలు నేడు స్పందించాయి. తాంత్రిక క్రతువులు నిర్వహించాలన్నది పోప్ గారి ఉద్ధేశం కాదని, అస్వస్థులకు స్వస్థత చేకూర్చే క్రమంలో ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటారని వివరణ ఇచ్చాయి.