: ప్రొస్టేట్ పోతేనేం... క్యాన్సర్ రాదు...!
ప్రొస్టేట్ గ్రంధి పోతేపోయింది... ఇక క్యాన్సర్ రాదు అని సంతోషిస్తున్నారు ఒక వ్యాపారవేత్త. బ్రిటన్‌కు చెందిన 53 ఏళ్ల వ్యాపారవేత్త కుటుంబ సభ్యుల్లో కొందరికీ రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయనకు అనుమానం వచ్చి తనకు కూడా లండన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ లో జన్యు పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు తనలోకూడా క్యాన్సర్‌కు కారకమైన బీఆర్సీఏ2 జన్యువు ఉన్నట్టు తేలింది. దీంతో ఆయన తన ప్రొస్టేట్ గ్రంధిని తొలగించాల్సిందిగా డాక్టర్లను కోరారు.
శరీరంలో బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జన్యువులు తీవ్రస్థాయింలో ఉంటే వారికి రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. తనలోనూ క్యాన్సర్ కారక జన్యువు ఉండడంతో తన ప్రొస్టేట్ గ్రంధిని తొలగించాల్సిందిగా ఆయన వైద్యులను కోరారు. ప్రొస్టేట్ గ్రంధిని తొలగించడం వల్ల సంతానం కలగకపోవడం, ఇంకా శృంగారపరమైన ఇబ్బందులూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఈ ఆపరేషన్‌కు నిరాకరించారు. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్‌తో సబంధం ఉన్న ఒక ప్రోటీన్ మోతాదు పెరిగితే దాన్ని గుర్తించేందుకు ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్షను నిర్వహించారు. ఈపరీక్షలో ఎలాంటి ఆందోళన కరమైన విషయం బయటపడలేదు.
అయితే ఆయన ప్రొస్టేట్ గ్రంధినుండి సేకరించిన కణజాలాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించినప్పుడు క్యాన్సర్ వ్యాధిని కలిగించేందుకు అవసరమైన మార్పులు అందులో చోటుచేసుకుంటున్నట్టు గుర్తించారు. దీంతో ఆ వ్యాపారి కోరినట్టుగా ఆయన ప్రొస్టేట్ గ్రంధిని తొలగించారు. తొలగించిన తర్వాత ఆ గ్రంధిని పరిశీలిస్తే అందులో క్యాన్సర్ గణనీయమైన స్థాయిలోనే ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇలా క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టి ప్రొస్టేట్ గ్రంధిని తొలగించుకోవడం మాత్రం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పుడు ఆ వ్యాపారి ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.