vietnam: మరిన్ని నగరాల్లో లాక్డౌన్.. ప్రజలను సిద్ధం చేసిన వియత్నాం ప్రధాని!
- ప్రస్తుతం ప్రతీ నిమిషం, ప్రతీ గంట ఎంతో కీలకం
- హనోయ్, హోచిమిన్ నగరాల్లోనూ లాక్డౌన్ అమలు చేస్తామన్న ప్రధాని
- దేశంలో 200 దాటని కరోనా కేసులు
కరోనా వైరస్‌కు ముకుతాడు వేయడంలో విజయం సాధించిన వియత్నాం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. దేశంలో కరోనా నిర్ధారిత కేసులు 200కు చేరుకోవడంతో, వైరస్ ఇక విస్తరించకుండా మరిన్ని నగరాల్లో లాక్డౌన్ విధించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని గుయెన్ జువాక్ ఫుక్ పేర్కొన్నారు. పెద్ద నగరాలైన హనోయ్, హోచిమిన్ నగరాలను పూర్తిగా లాక్డౌన్ చేసే అవకాశం ఉందని, ప్రజలు అందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ప్రతీ నిమిషం, ప్రతీ గంట ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. పైన చెప్పిన రెండు నగరాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఏ క్షణమైనా కఠిన నిర్ణయాలు అమలు చేసే పరిస్థితి రావొచ్చని ప్రజలను సిద్ధం చేసే ప్రయత్నం చేశారు. చైనాను ఆనుకుని ఉండే ఈ చిన్నదేశం కరోనా వైరస్ కట్టడిలో చైనా కంటే ముందే మేల్కొంది. ప్రపంచంలో మిగతా దేశాల కంటే ముందే అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. నగరాలను శుభ్రం చేసింది. పూర్తిగా అప్రమత్తమైంది. ఈ కారణంగా ప్రపంచం మొత్తం కోవిడ్‌తో అల్లాడుతున్నా.. వియత్నాంలో మాత్రం కేసుల సంఖ్య ఇప్పటికీ 200 దాటలేదు.