CPI Ramakrishna: ఎన్నికల కమిషనర్ పై సీఎం జగన్ విషం కక్కుతున్నారు: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna questions AP CM stand on SEC decision

  • స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ
  • అన్ని పార్టీలు స్వాగతించినా, జగన్ వైఖరి దారుణమన్న రామకృష్ణ
  • ప్రత్యర్థి పార్టీలను నామినేషన్లు కూడా వేయనివ్వడంలేదని ఆగ్రహం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, సీఎం జగన్ మాత్రం ఎన్నికల కమిషనర్ పై విషం కక్కుతున్నారని ఆరోపించారు. ఈసీ తీసుకున్న నిర్ణయంపై పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపితే ఫర్వాలేదని, కానీ సీఎం జగన్ వ్యవహార శైలి దారుణంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఒక్కసారి కూడా స్పందించని జగన్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

సీఎంకు చెందిన పులివెందుల నియోజకవర్గం సహా అనేకమంది మంత్రులకు చెందిన నియోజకవర్గాల్లో ఏకగ్రీవం కావడం ఏంటని మండిపడ్డారు. అక్కడెవరూ నామినేషన్లు వేసేవారే లేరా? అని అడిగారు. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లు వేయనిస్తున్నారా? అంటూ నిలదీశారు. "ఒక్క ఎంపీటీసీ కూడా వేరేవాళ్లకు రాకూడదట! సాక్షాత్తు పంచాయతీరాజ్ మినిస్టర్ తమ్ముడి నియోజకవర్గంలో మొలకలచెరువు మండలంలో 13 ఎంపీటీసీలు ఉంటే 12 మంది తెలుగుదేశం వాళ్ల నామినేషన్లు విత్ డ్రా చేయించారు. ఒక ఎంపీటీసీ స్థానంలో సీపీఐ పోటీలో ఉంది. సీపీఐ అభ్యర్థిని విత్ డ్రా చేయించేందుకు అర్ధరాత్రి వరకు బెదిరిస్తూనే ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే పిచ్చి పరాకాష్ఠకు చేరింది. పులివెందులలో కూడా ఇంతే. ఇతరులెవ్వరూ ఉండకూడదా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News