Chandrababu: ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయండి: జగన్ కు చంద్రబాబు సవాల్

  • మళ్లీ వైసీపీ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • రోజుకో మాట చెప్పే ఊసరవెల్లి జగన్
  • ఉన్మాది ప్రభుత్వంలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం

కౌన్సిల్ రద్దు తీర్మానంతో తామేమీ భయపడిపోమని, తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం, బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ రాష్ట్రానికి జగనే చివరి ముఖ్యమంత్రి కాదు అని, వీలైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళడానికి పాటుపడాలని సూచించారు.

నీతి, నిజాయతీకి పట్టం కట్టిన టీడీపీ ఎమ్మెల్సీలను ప్రజలు ఆశీర్వదించాలని, రోజుకో మాట చెప్పే ఊసరవెల్లి జగన్ గురించి ఆలోచించాలని పిలుపు నిచ్చారు. మూడు రాజధానులను ప్రజలు ఒప్పుకుంటారన్న నమ్మకం, ధైర్యం ఉంటే కనుక అసెంబ్లీని రద్దు చేయాలని సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. మళ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే కనుక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరో సవాల్ విసిరారు.

లేనిపక్షంలో అమరావతిపై ప్రజాభిప్రాయం సేకరించాలని, ప్రజలు చెప్పినట్టు చేయండి, కాదంటే ఊరుకోండని సూచించారు. లేకపోతే సెలెక్ట్ కమిటీ ప్రజాభిప్రాయానికి వెళుతుందని, దానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అన్నారు. దేనికీ ఒప్పుకోకుండా ఉన్మాది ప్రభుత్వంలా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.


ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తా నా గురించి మాట్లాడేది?

తన గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కు లేదని చంద్రబాబునాయుడు అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి, వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు కావాలని న్యాయస్థానాన్ని కోరిన వ్యక్తి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎక్కడో ఎలక్షన్లలో తానేదో చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి న్యాయస్థానం జడ్జిమెంట్  ఎప్పుడో వచ్చిందని, సభ్యతాసంస్కారాలు ఉంటే కనుక దానిని చూపి తనపై మాట్లాడాలని సీఎం జగన్ కు హితవు పలికారు.

తన రాజకీయ జీవితంలో తనపై ఎన్ని పిటిషన్లు వేశారో, కోర్టులు ఎన్ని కామెంట్స్ చేశాయో, అలాగే, జగన్ పై కూడా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, ఏం కామెంట్స్ చేశారో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని, మరి, జగన్ తనపై ఉన్న ఆరోపణలు తప్పని చెప్పగలరా? సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలరా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News