Chandrababu: జగన్ ఖైదీ నంబర్ 6093: చంద్రబాబు నాయుడు చురకలు
- ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా?
- గతంలో ఖైదీ ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్నారు
- ఆయనకు సిగ్గనిపించడం లేదా?
- ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి మనపై పెత్తనం చెలాయిస్తున్నారు
నూతన సంవత్సరం సందర్భంగా ఆనందంగా గడపాల్సిన ప్రజలు వైసీపీ ప్రభుత్వం చర్యల వల్ల రోడ్డుపైకి వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు పర్యటిస్తున్నారు. ఎర్రబాలెంలో రైతుల దీక్షలో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడారు.
'ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? గూగుల్ లో సెర్చ్ చేసి చూడండి.. ఖైదీ నంబరు 6093 అని కొట్టండి. జగన్ ఖైదీ నంబర్ 6093 అని వస్తుంది. ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆయనకు సిగ్గనిపించడం లేదా? ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి మనపై పెత్తనం చెలాయిస్తున్నారు. నేను నిప్పులా బతికాను, నన్ను ఏమీ చేయలేవు. జీఎన్ రావు కమిటీ అంటున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంటున్నారు. ఇది హైపవర్ కమిటీ అంటా? వీళ్లా రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించేది?' అని చంద్రబాబు నాయుడు చురకలంటించారు. గతంలో హైదరాబాద్ లో తాను చూపిన చొరవ వల్లే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఆ ఇబ్బందులను అధిగమించాల్సిన సమయంలో పాలన సరిగా లేదని విమర్శించారు.