: 31 ఏళ్లపాటు ప్రయాణించిన లెటర్
సర్ పోస్ట్.. అని కేక వేస్తూ పోస్ట్ మెన్ వచ్చి కంటి డాక్టర్ అశోక్ ష్రాఫ్ చేతిలో పెట్టాడు. దానిని పరిశీలనగా చూసిన డాక్టర్ కు పట్టరానంత సంతోషం వేసింది. ఎందుకంటే, ఆ ఇన్ లాండ్ లెటర్ 31 ఏళ్ల పాటు ప్రయాణం చేసి వచ్చింది మరి. గుజరాత్ లోని నవాసరి పట్టణంలో అశోక్ కంటి డాక్టర్ గా సేవలందిస్తున్నారు. ఆయన మిత్రుడైన డాక్టర్ శ్యామ్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 1982 జనవరి 1న ఇన్ లాండ్ లెటర్ పోస్ట్ చేశారు. ఆయన కూడా గుజరాత్ లోనే ఆనంద్ అనే పట్టణంలో ఉంటారు. అది ఇంతకాలం ఎక్కడెక్కడ తిరిగిందోకానీ, పోయిన గురువారం వచ్చి డాక్టర్ అశోక్ ను చేరింది.
సహజంగా అయితే ఇంతకాలం ఆలస్యమైనందుకు మరొకరు అయితే పోస్టల్ శాఖను బండబూతులు తిడతారు. కానీ డాక్టర్ అశోక్ కృతజ్ఞతలు తెలియజేశాడు. తన మిత్రుడు రాసిన లేఖను ఇంకాలం జాగ్రత్త చేసి ఆలస్యమైనా తనకు అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని లెటర్ రాసిన శ్యామ్ కుమార్ కు కూడా ఫోన్ చేసి తెలిపారు. అప్పట్లో లెటర్లే ఏకైక సమాచార మాధ్యమంగా ఉండవేని చెప్పారు!