Jagan: హ్యాట్సాఫ్ టు కేసీఆర్ గారూ.. తెలంగాణ పోలీసులు: అసెంబ్లీలో జగన్
- దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు
- సినిమాల్లో దోషులను చంపితే చప్పట్లు కొడతారు
- నిజ జీవితంలో ఇలాంటి పని చేస్తే మానవ హక్కుల కమిషన్ వస్తోంది
- ఈ రోజుకి కూడా నిర్భయ దోషులకు శిక్ష పడలేదు
దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. 'హ్యాట్సాఫ్ టు కేసీఆర్ గారూ.. తెలంగాణ పోలీసులు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. సినిమాల్లో దోషులను చంపితే మాత్రం చప్పట్లు కొడతారు. నిజ జీవితంలో దమ్మున్న వారు ఎవరైనా ఇలాంటి పని చేస్తే మానవ హక్కుల కమిషన్ అట ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయి' అని జగన్ అన్నారు.
'నాలుగు నెలల్లో తీర్పు నిచ్చి, శిక్ష వేయాలని నిర్భయ చట్టం చెబుతోంది. ఈ రోజుకి కూడా నిర్భయ దోషులకు శిక్ష పడలేదు. ఏపీలో ఆడపిల్లలకు భద్రతపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులను కాల్చేయాలని ఎవరూ అనుకోరు. కానీ, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా న్యాయం జరగడంలో జాప్యం జరుగుతుందని అనిపిస్తే మాత్రం ప్రజల్లో ఆగ్రహం తన్నుకొస్తుంది' అని జగన్ వ్యాఖ్యానించారు.