Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు
- టీడీపీలోకి సమితి అధ్యక్షుడు సహా 13 జిల్లాల సభ్యులు
- పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన బాబు
- మా హయాంలో బీసీలకు పెద్దపీట వేశాం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. బీసీ హక్కుల సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ సహా పదమూడు జిల్లాలకు చెందిన సభ్యులకు చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పారు. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ హయాంలో అన్ని పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశామని చెప్పారు. డిప్యూటీ సీఎం పోస్ట్ సహా 8 కీలక మంత్రిత్వ శాఖలు బీసీలకే కేటాయించామని గుర్తుచేసుకున్నారు. బీసీలకు టీడీపీ అండగా వుంటుందనే వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇసుక కొరత కారణంగా పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న అరవై మంది భవన నిర్మాణ కార్మికుల్లో నలభై ఎనిమిది మంది బీసీలే అని అన్నారు. బీసీలను నిర్లక్ష్యం చేస్తే కనుక వైసీపీ పాలనకు చరమగీతం తప్పదని హెచ్చరించారు.