: ఆర్మీలో ఐఎస్ఐ ఏజెంట్.. అరెస్టు చేసిన పోలీసులు
పాకిస్తాన్ గూడఛారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కు సమాచారం చేరవేస్తున్నాడని ఓ భారత సైనికోద్యోగిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బి.కె. సిన్హా అనే వ్యక్తి ఆర్మీలో అప్పర్ డివిజన్ క్లర్క్ గా పనిచేస్తూ.. సైన్యానికి చెందిన కీలక వివరాలను, పత్రాలను నేపాల్ కు చెందిన మరో ఏజెంట్ ద్వారా ఐఎస్ఐకి చేరవేస్తున్నట్టు తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సిన్హా జైపూర్లోని సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ యూనిట్ లో సరఫరాల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
సిన్హాను అరెస్టు చేసిన అనంతరం రాజస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ డైరక్టర్ డీఎస్ దినకర్ మీడియాతో మాట్లాడుతూ, ఆర్మీలో పనిచేస్తున్న మరో వ్యక్తి ద్వారా సిన్హా ఐఎస్ఐతో సంబంధాలేర్పరచుకున్నాడని తెలిపారు. తరచూ నేపాల్ రాజధాని ఖాట్మండూ వెళుతూ భారత సైన్యం ఆనుపానులు ఐఎస్ఐతో పంచుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు. సిన్హా వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అతని నివాసంపై దాడి చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సిన్హా నేరం అంగీకరించినట్టు తెలిపిన పోలీసులు అతనిపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.