cm: ఇసుక కావాలంటే ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కావాలి!: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
- రాష్ట్రంలో ఇసుక కొరతను కృత్రిమంగా సృష్టించారు
- ఇసుక పంచాయతీలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవట్లేదు
- పేదవాళ్ల బతుకులు తమాషాగా కనిపిస్తున్నాయా?
ఏపీ ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పన్నెండు గంటల నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక కొరత సహజంగా వచ్చింది కాదని, కృత్రిమంగా సృష్టించారని దుయ్యబట్టారు. ఇవాళ ఇసుక కావాలంటే ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కావాలని మండిపడ్డారు.
ఇసుక కొరతను సృష్టించి సిమెంట్ కంపెనీలతో సీఎం బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని, ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని మండిపడ్డారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంటే ఇంటి దొంగలు సీఎంకు కనబడరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్ద స్వార్థం కోసమే ఇసుక సమస్యను సృష్టించారని, దాదాపు 35 లక్షల మంది తిండికి కూడా నోచుకోని దుస్థితి కల్పించారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెెరిగారు. ఇసుక కొరత కారణంగా 125 వృత్తుల వాళ్లు రోడ్డునపడ్డారని, ఇంతలా ఇసుక సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
ఇసుక పంచాయతీలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని, పేదవాళ్ల బతుకులు మీకు తమాషాగా కనిపిస్తున్నాయా? అని మండిపడ్డారు. ప్రతి అంశంలోనూ J-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, సీఎం జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ లాంటి కుటిల రాజకీయనేతలను చాలామందిని చూశానని, కార్మికులు కాలం తీరి చనిపోయారని ఒక మంత్రి మాట్లాడటం దారుణమని విమర్శించారు.
ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ల గురించి ఆయన ప్రస్తావించారు. తమ హయాంలో అన్ని వసతులు కల్పించి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, కార్మికులు మూడు పూటలా భోజనం చేసి ఇంటికి వెళ్లేవారని అన్నారు. పేదవాళ్లకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మిమ్మల్ని ఏం చేశాయి? అని ప్రశ్నించారు.