Andhra Pradesh: పదేళ్ల తర్వాత రోబోటిక్స్ కీలకం కానున్నాయి.. ఆంగ్ల చదువులు లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏంటీ?: సీఎం జగన్
- ‘మనబడి నాడు నేడు’ కార్యక్రమం ప్రారంభం
- పేదల తలరాత మార్చాల్సిన అవసరం లేదా?
- కార్పొరేట్ చదువులకు కొమ్ముకాయడం సమంజసమా?
పదేళ్ల తరువాత రోబోటిక్స్ కీలకం కాబోతున్నాయని, ఆంగ్ల చదువులు లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏంటీ? అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒంగోలులో ‘మనబడి నాడు నేడు’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయిస్తుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేస్తారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... 'ఆంగ్ల చదువులు లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏంటీ?.. 33 శాతం మంది పిల్లలు చదువుకి దూరంగా ఉంటున్నారు. పేదల తలరాత మార్చాల్సిన అవసరం లేదా? కార్పొరేట్ చదువులకు కొమ్ముకాయడం సమంజసమా? ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలను మార్చాలి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలను చదివిస్తున్నారా? మన పిల్లలకు ఆంగ్ల చదువులు లేకపోతే వారి పరిస్థితేంటో చెప్పండి' అని ప్రశ్నించారు.