Chandrababu: చంద్రబాబును లోపల వేయడానికి బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి: జేసీ వ్యాఖ్యలు
- ఓ మీడియా చానల్ కు జేసీ ఇంటర్వ్యూ
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ
- జగన్ కు కోపం ఉండడం సహజమేనని వ్యాఖ్య
ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ రాజకీయవేత్త జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబును లోపలికి పంపే యత్నాలు జరగడం సాధారణమేనని, ఇందులో బీజేపీ పాత్ర ఉందో, లేదో సరిగా చెప్పలేను కానీ, వైసీపీ మాత్రం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుందని జేసీ వివరించారు. తాను ఇదే విషయాన్ని చంద్రబాబును కూడా అడిగినట్టు వెల్లడించారు.
"ఏం బాబూ ఎప్పుడు లోపలికి వెళ్లేది అని చంద్రబాబును అడిగితే, నేను లోపలికి పోను దివాకర్ రెడ్డీ, వీళ్లు నన్నేమీ చేయలేరు అని చెప్పారు. నేను ఏ విషయాన్ని దాచుకోను. అందుకే చంద్రబాబును అడిగితే ఆయన నేనేమీ తప్పు చేయలేదు, నాకేమీ కాదు అని ధీమా వ్యక్తం చేశారు" అంటూ జేసీ వివరించారు.
అప్పట్లో అమాయకుడైన జగన్ ను చంద్రబాబు, సోనియా అందరూ కలిసి జైల్లో వేశారని వైసీపీ వాళ్లు అనుకుంటుంటారని వెల్లడించారు. అందులో నిజం ఎంతో తనకు తెలియదు కానీ, 45 ఏళ్ల నవయువకుడైన జగన్ కు కోపమో, తాపమో ఉండడం సహజమేనని, అతని ఆవేశాన్ని తాను తప్పుబట్టడంలేదని అన్నారు. జగన్ పుట్టిపెరిగిన వాతావరణం, అతను పీల్చిన గాలి, ఇతర పరిస్థితుల ప్రకారం చంద్రబాబును లోపల వేయాలన్న ఆలోచన అతనిలో ఉంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని జేసీ అభిప్రాయపడ్డారు.