: కృత్రిమంగా ఆరోగ్యవంతమైన పిల్లలు...!
కృత్రిమ గర్భధారణ ద్వారా అత్యంత ఆరోగ్యవంతమైన పిల్లలను తల్లిదండ్రులు పొందవచ్చు. ఈ విషయాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సహజంగా కృత్రిమంగా ఫలదీకరణం జరిగిన పిండాలను గర్భాలలో ప్రవేశపెట్టినపుడు వాటిలో దాదాపు 24 శాతం మాత్రమే విజయవంతం అవుతుంటాయి. అలా కాకుండా కృత్రిమ పిండాలలో అత్యుత్తమ పిండాలను ఎంపిక చేసుకుని గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా 78 శాతం పిండాలు ఆరోగ్యవంతమైన బిడ్డలుగా రూపుదిద్దుకుంటున్నట్టు బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేర్ ఫర్టిలిటీ గ్రూప్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సాధించారు. ఈ విషయం గురించి సంస్థ ఎండి ప్రొఫెసర్ సైమన్ ఫిషెల్ మాట్లాడుతూ గత 30 ఏళ్లలో తమ సంస్థ సాధించిన విజయాల్లో ఇదే అత్యంత ఆసక్తికరమైనదని భావిస్తున్నట్టు చెప్పారు.
ఫర్టిలిటీ ద్వారా తెలియకుండా కొన్ని వ్యర్ధ పిండాలను మహిళల గర్భంలోకి ఇన్ విట్రో ఫర్టిలైజెషన్ (ఐవీఎఫ్) పద్ధతి ద్వారా ప్రవేశపెడుతున్నామని, అయితే తాము కనుగొన్న ఈ విధానం ద్వారా అత్యుత్తమ పిండాలను ఇకపై ఎంపిక చేసుకోవచ్చని ఫిషెల్ అంటున్నారు. ఇందుకోసం పిండం తొలినాటి జీవనచక్రంలోని రెండు కీలక దశల మధ్యలో వృద్ధి చెందడానికి పిండం తీసుకుంటున్న సమయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐవీఎఫ్ పిండం జీవనచక్రంలోని మొదటి రెండు రోజుల్లో వేలాదిగా టైమ్`ల్యాప్స్ ఫోటోలున తీయాలి. ఈ ఫోటోల ద్వారా పిండం బ్లాస్టులా దశ నుండి తన రక్షణ కవచాన్ని వీడి బయటికి రావడానికి సిద్ధమయ్యే దశకు చేరే సమయాన్ని గుర్తిస్తారు. ఇంక్యుబేటర్‌లో ఉంచిన ఐవీఎఫ్ పిండాలను సాధారణంగా రోజూ ఎంబ్రియాలజిస్టులే తనిఖీ చేస్తారు. అయితే టైమ్`ల్యాప్స్ కెమెరాలు ఆటోమేటిగ్గా ప్రతి పది నిముషాలకు ఒకసారి ఫోటోలు తీస్తుంటాయి. ఈ క్రమంలో అవి పిండం యొక్క అభివృద్ధి విధానంలో ఏవిధంగానూ జోక్యం చేసుకోవు. పిండం యొక్క అభివృద్ధికి సంబంధించిన రెండు దశల మధ్య జరిగే వృద్ధికి ఆరుగంటల కన్నా ఎక్కువ సమయం పడితే ఆ ఐవీఎఫ్ పిండాల్లో అసాధారణ క్రోమోజోములు ఉన్నట్టు అర్ధమవుతుంది. ఇలాంటి పిండాలను గర్భంలో ప్రవేశపెడితే అవి ఎక్కువగా విఫలం అయ్యే అవకాశం ఉంటుంది. సుమారు 69 జంటలపై చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు టైమ్`ల్యాప్స్ విధానం ద్వారా ఒక్క విభాగానికి చెందిన రోగుల్లో విజయాల రేటు 39 శాతం నుండి 61 శాతానికి పెరిగినట్టు కనుగొన్నారు. ఈ విధానాన్ని మరింత మెరుగుపరిస్తే, ఐవీఎఫ్ విధానం ద్వారా మరిన్ని ఫలితాలను పొందవచ్చని ఫిషెల్ అంటున్నారు.