: మీరెప్పుడైనా ఎర్ర వజ్రాలు చూశారా...?


మీరెప్పుడైనా ఎర్ర వజ్రాలు చూశారు...? చూడకుంటే వెంటనే ఆష్ట్రేలియాకు వెళ్ళండి. అక్కడ త్వరలో జరగబోయే వజ్రాల వేలం పాటలో ఎర్ర వజ్రాలను చూడొచ్చు... కావాలంటే కొనుక్కోవచ్చు కూడా... ఆష్ట్రేలియాలోని రియో టింటో అనే వజ్రాల గనుల సంస్థ ఆర్గైల్‌ వజ్రాల గని నుండి మూడు అరుదైన ఎర్రటి వజ్రాలను వెలికితీసింది. వజ్రాలు చాలావరకు పలు రంగులను కలిగివుంటాయి. స్వచ్ఛమైన వజ్రాలు రంగులేకుండా ఉంటాయి. అయితే ఎర్రటి రంగును కలిగిన వజ్రాలు అరుదుగా లభిస్తాయి. ఈ విషయాన్నే రియోటింటో సంస్థ చెబుతోంది.

ఈ అరుదైన వజ్రానికి ఆర్గైల్‌ ఫోనిక్స్‌ అనే పేరుపెట్టారు. 1.56 క్యారట్లు కలిగిన ఈ అరుదైన వజ్రంతోబాటు మరో రెండు ఎర్ర వజ్రాలను కూడా త్వరలో ఈ సంస్థ విక్రయానికి పెట్టనుంది. రియోటింటో సంస్థ ఏర్పడి ఇప్పటికి 30 ఏళ్లు అయినా ఇలాంటి ఎర్రటి వజ్రాలను ఇంత వరకూ వేలానికి ఉంచలేదని, ఈ అరుదైన వజ్రాలకు ఆసియా దేశాల్లో మంచి గిరాకీ ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ భావిస్తోంది. ఈ అరుదైన మూడు ఎర్ర వజ్రాలతోబాటు 64 వజ్రాలను కూడా ఈ వేలంలో ఉంచనున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వీటిలో మూడు నీలి రంగు వజ్రాలు, 58 గులాబీ రంగు వజ్రాలు కూడా ఉన్నాయట. ఈ వజ్రాల వేలం ఆగస్టులో మొదలై అక్టోబరులో పూర్తి కానుంది. కాబట్టి ఎర్రటి అరుదైన వజ్రాలను చూడాలన్నా... కొనాలన్నా... వెంటనే ఆష్ట్రేలియాకు బయల్దేరండి మరి...!

  • Loading...

More Telugu News