: 'పద్మాలయా' నుంచి హరీశ్ రావు రూ.80 లక్షలు స్వీకరించారు: రఘునందన్
టీఆర్ఎస్ పార్టీ బహిష్కరణకు గురైన రఘునందన్ రావు.. ఎమ్మెల్యే హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. పద్మాలయా స్టూడియో భూముల వ్యవహారంలో హరీశ్ రావు ముడుపులందుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు. విజయశాంతి నివాసంలో జరిగిన సెటిల్ మెంట్ వ్యవహారంలో హరీశ్ రావుకు రూ.80 లక్షలు ముట్టాయని వెల్లడించారు. ఈ ఒప్పందానికి సంబంధించి అన్ని ఆధారాలను ప్రభుత్వంతో పాటు పోలీసులకు అప్పగిస్తానని రఘునందన్ చెప్పారు.
కాగా, తనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో తెలపడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, అందుకే, ఆ పార్టీకి రెండు మూడు రోజుల్లో లీగల్ నోటీసులు పంపిస్తానని రఘనందన్ రావు చెప్పారు. తనపై వేటు వేయడానికి తగిన కారణాలు చూపడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. అంతేగాకుండా, ఆధారాలు లేకుండా తనపై అసత్య కథనాలు ప్రసారం చేసిన టీ న్యూస్ యాజమాన్యంపైనా న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.