Telugudesam: తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణంపై చంద్రబాబు దృష్టి
- పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే చర్యలు
- పార్టీలో ఉన్నవారిపై దృష్టి సారించాలని సూచన
- ఇకపై ప్రతీ శనివారం హైదరాబాద్‌లో ఆత్మీయ కలయిక
తెలంగాణలో కునారిల్లుతున్న పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన టీటీడీపీ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణపై ఆదివారం ఆయన ముఖ్యనేతలతో చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. వారం లోగా కొత్త కమిటీలను భర్తీ చేయాలని ఆదేశించారు.
ఈ నెల 14 నుంచి ప్రతీ శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ కలయిక, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా నాయకులకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారిని మర్చిపోవాలని, పార్టీని నమ్ముకుని ఉన్న వారి గురించి ఆలోచించాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.