vh: త్వరలో పార్టీ మారనున్న వీహెచ్...?
- పీసీసీ తీరుపై అసంతృప్తి
- ఖమ్మం లోక్ సభ టికెట్ కు తన పేరు సిఫారసు చేయలేదంటూ ఆరోపణ
- రాజీవ్ గాంధీ జయంతి తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త వి.హనుమంతరావు తన భవిష్యత్తుపై తీవ్ర నిర్ణయం తప్పదంటున్నారు. తెలంగాణ పీసీసీ విషయంలో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న వీహెచ్ త్వరలోనే పార్టీ మార్పుపై నిర్ణయం ఉంటుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది.
తాను స్వయంగా కోరినా తన పేరు లేకుండానే పీసీసీ నేతలు ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాను హైకమాండ్ కు పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నిజాయతీపరులకు అన్యాయం జరుగుతోందని, పార్టీలో రాజీవ్ గాంధీ అభిమానులకు న్యాయం జరగడం లేదని వీహెచ్ వాపోయారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన మీదట రాజీవ్ గాంధీ జయంతి తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని స్పష్టం చేశారు.