Telugudesam: నీళ్లు, నిధులు తెలంగాణకు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాలరాస్తారా?: ఏపీ సర్కారుపై టీడీపీ ఫైర్
- అమరావతిలో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- రెండు నెలల పాలనకే మాట తప్పుతున్నారంటూ విమర్శించిన టీడీపీ నేతలు
- 45 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పి మాట మార్చారంటూ ఆగ్రహం
రాజధాని అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ప్రభుత్వంలోని పలు శాఖలకు సీఎం బంధువులే మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. ఏకపక్షంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. శాసనసభలో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
సభలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఏ బిల్లులోనూ కొత్తదనం లేదని టీడీపీ నేతలు పెదవి విరిచారు. హడావుడిగా బిల్లులు తయారుచేసి సభలో ప్రవేశపెట్టారని ఆరోపించారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.5,700 కోట్లు ఇంతవరకు రాబట్టలేదని, పైగా హైదరాబాద్ లోని భవనాలపైనా హక్కులు వదిలేసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి విధులపై సుప్రీం తీర్పును గౌరవించాలని ఎందుకు కోరలేదంటూ నిలదీశారు.
తెలంగాణలో ఉన్న సింగరేణి కాలరీస్ వారికే చెందుతుందని అన్నారని, మరలాంటప్పుడు ఇక్కడ ఉన్న హెవీ మిషనరీ ఇంజినీరింగ్ కు అదే పాలసీ ఎందుకు వర్తించదని టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. నీళ్లు, నిధులు తెలంగాణకు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాలరాస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. కేవలం రెండు నెలల పాలనకే మాట తప్పుతున్నారని, మడమ తిప్పుతున్నారని విమర్శించారు. 45 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పడం, ఆపై మాట మార్చడం మోసం చేయడం కాదా అంటూ నిలదీశారు.,