Andhra Pradesh: అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు: చంద్రబాబు ఆగ్రహం
- మా అభ్యంతరాలను పట్టించుకోవట్లేదు
- మాట నిలబెట్టుకోమంటే మా నేతలను సస్పెండ్ చేశారు
- పుష్కరాల ఘటనను ప్రస్తావించడం తగదు
శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సమావేశాల నుంచి తెలుగుదేశం పార్టీ ఈరోజు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు.
నలభై ఐదేళ్ల వారికి పెన్షన్ ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నందుకు ముగ్గురు టీడీఎల్పీ సభ్యులను సస్పెండ్ చేశారని, దీనిపై మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. పులివెందుల పంచాయతీ పెట్టి అసెంబ్లీని నడిపిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్ శాసిస్తే, స్పీకర్ పాటిస్తున్నారని ఆరోపించారు. సభ నుంచి వాకౌట్ చేసే ముందు మాట్లాడే అవకాశం కూడా తమకు ఇవ్వలేదని, దీంతో, దండం పెట్టి వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు.
‘మా అభ్యంతరాలను పట్టించుకోకుండా సభను కొనసాగిస్తున్నారు’ అని, ఎప్పుడో జరిగిపోయిన పుష్కరాల ఘటనను ప్రస్తావిస్తూ తనపై నిందలు వేశారని మండిపడ్డారు. వైసీపీ సభ్యుల విమర్శలపై మాట్లాడే అవకాశం తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రూ.12,500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్, ఇప్పుడు కేంద్రం సగం, రాష్ట్రం సగం ఇస్తుందని అంటున్నారని, 'మాట తప్పం, మడమ తిప్పం’ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.