Andhra Pradesh: ఆ బిల్లులను మేం వ్యతిరేకించామా?: వైసీపీపై చంద్రబాబు ఫైర్
- ఇలాంటి తప్పుడు విధానాలు మంచిది కాదు
- నా హయాంలో అమరావతి ప్రపంచాన్ని ఆకర్షించింది
- ఇప్పుడు.. అందరూ నెగెటివ్ గా చెప్పుకుంటున్నారు
ఏపీ అసెంబ్లీలో ఈరోజు కొన్ని కీలక బిల్లులను వైసీపీ సభ్యులు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడుగు, బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఈ బిల్లుల ప్రతిపాదనకు టీడీపీ సభ్యులు అడ్డు తగిలారని వైసీపీ సభ్యులు ఆరోపించడంపై చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి తప్పుడు విధానాలు మంచిది కాదని, తమపై అలాంటి ముద్ర వేయకూడదని అన్నారు.
తన హయాంలో అమరావతి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని, ఇప్పుడు, ఇదే అమరావతి గురించి నెగెటివ్ గా మాట్లాడుకునే పరిస్థితులు వస్తున్నాయని విమర్శించారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో పెట్టేశారని, అప్పుడే, విద్యుత్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. ఒక్క పని కూడా వైసీపీ ప్రభుత్వం చేయడం లేదని, అపోహలు సృష్టిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.