Andhra Pradesh: విద్యుత్ ను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశామన్నది అవాస్తవం: చంద్రబాబు వివరణ
- బాబు హయాంలో కుదుర్చుకున్న పీపీఏలపై వివరణ
- సౌర, పవన్ విద్యుత్ ను ఎక్కువ ధరలకు కొనుగోలు చేయలేదు
- టెండర్లపై ఏమీ తెలియకుండానే విమర్శలు తగదు
ఏపీలో గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో ఒప్పందాలు కుదుర్చుకుందని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఖండించారు. గతంలో తమ ప్రభుత్వం చేసుకున్న పీపీఏలపై వివరణ ఇచ్చారు.
మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, సౌర, పవన విద్యుత్ ను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశామని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టెండర్లపై ఏమీ తెలియకుండానే విమర్శలు చేస్తున్నారని అన్నారు. పునరుత్పాదక ఇంధనం కొనుగోలుపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఐదు శాతం కంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. పోల్చేటప్పుడు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని, తాము ఎప్పుడూ రూ.6.90కి సౌరవిద్యుత్ కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు.