Telangana: డబ్బు కోసం వృద్ధ దంపతులను చంపి గుట్టల్లో విసిరేసిన కారు డ్రయివర్
- అనంతగిరి అడవుల్లో జంట మృతదేహాలు
- వృద్ధులను చంపి స్నేహితుడి సాయంతో అడవిలో పారేసిన డ్రయివర్
- నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో లభ్యమైన రెండు మృతదేహాలు తీవ్రకలకలం రేపాయి. వాటిని హత్యలుగానే భావించిన పోలీసులు కొద్ది వ్యవధిలోనే మిస్టరీని ఛేదించారు. డబ్బు, నగల కోసం కారు డ్రయివరే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుసుకున్నారు. మృతులు హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ కు చెందిన నవరతన్ రెడ్డి, స్నేహలత దంపతులుగా గుర్తించారు.
నవరతన్ రెడ్డి కర్ణాటకలోని హుస్నాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నవరతన్ రెడ్డి, స్నేహలత దంపతులు ఓ సైట్ చూసేందుకు హుస్నాబాద్ వెళుతుండగా, కారు డ్రయివర్ సతీశ్ మార్గమధ్యంలో దంపతులను దారుణంగా చంపి, తన స్నేహితుడు రాహుల్ సాయంతో వారిని అనంతగిరి గుట్టల్లో విసిరేశాడు. పోలీసులు అనుమానంతో డ్రయివర్ సతీశ్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిజం బయటపడింది. తానే ఆ వృద్ధ దంపతులను చంపినట్టు సతీశ్ అంగీకరించాడు. డబ్బు కోసమే ఈ ఘాతుకానికి తెగబడినట్టు తెలిపాడు.