Telangana: కానిస్టేబుల్ అంత్యక్రియల్లో పాడె మోసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
- యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన కానిస్టేబుల్
- అంత్యక్రియలకు హాజరైన సజ్జనార్
- కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
బీహార్ లో ఉన్న నిందితుడ్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు వెళ్లి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కానిస్టేబుల్ తులసీరాం మృతి చెందడం తెలిసిందే. తులసీరాం మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఈ రోజు తులసీరాం అంత్యక్రియలు నిర్వహించగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సైతం పాడె మోసి తన డిపార్ట్ మెంట్ సహచరుడికి ఘన నివాళి అర్పించారు.
సీపీ స్థాయి అధికారి ఓ కానిస్టేబుల్ అంత్యక్రియలకు రావడమే కాకుండా, పాడె మోయడం ఆయన మానవతకు నిదర్శనం. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ, తులసీరాం కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఓ కేసులో భాగంగా బీహార్ లో ఉన్న నిందితుడ్ని పట్టుకునేందుకు ఓ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. బీహార్ నుంచి నిందితుడితో కలిసి ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా, మధ్యప్రదేశ్ లో వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ తులసీరాంతో పాటు నిందితుడు కూడా మరణించాడు.