Chandrababu: టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన చంద్రబాబు
- పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం
- కార్యకర్తలపై దాడుల పట్ల ఆందోళన
- శ్రేణులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా
ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుండడం పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను ఆయన ఖండించారు. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల పరిస్థితిని నాయకులు చంద్రబాబుకు వివరించారు.
కాగా, ఈ నెల 15న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఇతర నేతలకు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. అంతేగాకుండా, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రస్తుత ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.