India: హిమాలయాల్లో మరో భారీ ప్రమాదం... ఎనిమిది మంది గల్లంతు
- నందాదేవి శిఖరం అధిరోహిస్తుండగా ప్రమాదం
- బేస్ క్యాంపుకు చేరుకోని పర్వాతరోహకులు
- గల్లంతైన వారి కోసం వెదుకుతున్న వాయుసేన హెలికాప్టర్లు
ఇటీవల హిమాలయ పర్వత ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి పలువురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొన్నిరోజులకే మరోసారి హిమాలయ పర్వతసానువుల్లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈసారి ఏకంగా ఎనిమిదిమంది గల్లంతయ్యారు. నందాదేవి పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లినవారిలో ఎనిమిది మంది తిరిగి బేస్ క్యాంపుకు చేరుకోకపోవడంతో వారందరూ ప్రమాదంలో చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ కాగా, నందాదేవి శిఖరం అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికంటే నందాదేవి ఎక్కుతూ గల్లంతైన వారి సంఖ్యే అధికంగా ఉంది.
కాగా, ప్రమాద సమాచారం అందిన వెంటనే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది సాయంతో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. బేస్ క్యాంపులో ఖాళీ టెంట్లు తప్ప మనుషులు జాడ లేకపోవడంతో వారందరూ సజీవంగా ఉండే అవకాశాలు తక్కువని అర్థమవుతోంది.
గల్లంతైనవారిలో భారత్ కు చెందిన పర్వాతారోహకులతో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల పర్వాతారోహకులు కూడా ఉన్నారు. గల్లంతైనవారిని వెదికేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. శిఖరం ఎక్కే క్రమంలో మంచు చరియలు విరిగిపడడంతో ప్రమాదం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.