BJP: నాలుగు సీట్లు గెలిచినందుకు అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు: లక్ష్మణ్
- అంచనాలను మించి ఓట్లు వచ్చాయి
- 2023లో తెలంగాణలో బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది
- కేసీఆర్, కేటీఆర్ ల అహంకారానికి ప్రజలు బుద్ధిచెప్పారు
కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కొత్త క్యాబినెట్ సభ్యుల పదవీప్రమాణస్వీకార కార్యక్రమానికి లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో తాము నాలుగు లోక్ సభ స్థానాలు గెలవడం పట్ల బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. అంచనా వేసిన దానికంటే అధిక సంఖ్యలో ఓట్లు రాబట్టామని లక్ష్మణ్ వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో సీఎం కేసీఆర్, కేటీఆర్ ల అహంకారానికి ప్రజలు బుద్ధిచెప్పిన విధంగా ఓటింగ్ జరిగిందని అన్నారు. 2023లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుచేయబోయేది బీజేపీయేనని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా ఫలితాలు చూసి టీఆర్ఎస్ నాయకుల్లో కలవరం మొదలైందని వ్యాఖ్యానించారు. ఇక, కేంద్రంలో కొలువుదీరిన కొత్త క్యాబినెట్ పైనా ఆయన స్పందించారు. శాఖల కేటాయింపు మోదీ మార్కు పాలనకు నిదర్శనమని అన్నారు. ఇది దేశాన్ని ముందుకు నడిపించే క్యాబినెట్ అని లక్ష్మణ్ అభివర్ణించారు.