Jagan: ప్రసంగం ప్రారంభంలోనే టీడీపీకి చురకలు అంటించిన సీఎం జగన్
- రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకువచ్చాం
- మాది ప్రజల మేనిఫెస్టో
- ఇతరుల్లాగా కులానికో పేజీతో పుస్తకాలు తీసుకురాలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపటి క్రితం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వేల కిలోమీటర్ల కొద్దీ తాను సాగించిన పాదయాత్రను, ఆదరించిన జనం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సాధకబాధకాల నుంచే వైసీపీ మేనిఫెస్టో పుట్టిందని, ఇతరుల్లాగా పుస్తకాలు, కులానికో పేజీ పెట్టి మేనిఫెస్టో తయారుచేయలేదంటూ ప్రత్యర్థులకు చురకలు అంటించారు.
కేవలం రెండంటే రెండు పేజీలతో అందరికీ గుర్తుండేలా, అన్నిరకాల సంక్షేమ పథకాలను మేనిఫెస్టో రూపొందించామని జగన్ వివరించారు. సామాన్యుల ఆశలు, ఆకాంక్షలు, వారి కష్టాలను ప్రతిబింబించేలా రెండు పేజీలతోనే వైసీపీ మేనిఫెస్టో తీసుకువచ్చామని తెలిపారు. అంతేతప్ప, ఏ కులాన్ని మోసం చేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేయలేదని స్పష్టం చేశారు.