KCR: కొద్దిక్షణాల క్రితమే నవ్యాంధ్రకు నవశకం... ఇక ఖడ్గచాలనం కాదు, కరచాలనమే: కేసీఆర్

  • జగన్ ను అభినందించిన సీఎం
  • నేడు ఉజ్వలఘట్టం
  • నదుల నీటి వినియోగంపై కలిసిసాగుదాం
  • జగన్ ప్రమాణం అనంతరం కేసీఆర్

కొద్దిక్షణాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవయువ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నవశకం ప్రారంభమైందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.  ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ను ఆశీర్వదిస్తూ, మాట్లాడిన ఆయన, తెలుగు ప్రజల జీవన గమనంలో నేడు ఓ ఉజ్వలమైన ఘట్టమని అభివర్ణించారు. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.

జగన్ వయసు చిన్నదని, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించిన కేసీఆర్, బాధ్యతలను అద్భుతంగా నిర్వహించే శక్తి, ధైర్యం, సామర్థ్యం ఆయనకు ఉందని గత తొమ్మిదేళ్లలో ఆయన నిరూపించారని అన్నారు. వయసు చిన్నదైనా, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆయన్ను ముందుకు నడిపిస్తుందని అన్నారు. జగన్ సంపూర్ణ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక రెండు రాష్ట్రాలూ ఖడ్గచాలనం వదిలేసి కరచాలనం చేసే రోజు ఇదని, తనకు తెలిసి జగన్ ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగమని, అది 100 శాతం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.

కృష్ణా జలాల విషయంలో సమస్యలున్నా, ప్రతి నీటి చుక్కనూ వినియోగించుకుందామని, రెండు రాష్ట్రాల్లోని ప్రతి అడుగు భూమినీ సస్యశ్యామలం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మార్గంలో అన్నివిధాలైన సహకారాన్ని తాము అందిస్తామని చెప్పారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నాన్నగారి పేరును నిలబెట్టుకోవాలని, కనీసం మూడు నాలుగు టర్మ్ ల వరకూ జగన్ పరిపాలన సాగాలని కోరుకుంటున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News